ఢిల్లీ, తొలివెలుగు: కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 1971లో పాక్ తో జరిగిన యుద్ధంలో అమరులైన జవాన్లకు గుర్తుగా ఏర్పాటు చేసిన అమరజ్వోతిని జాతీయ యుద్ధ సార్మకం వద్ద ఉన్న జ్యోతితో కలపాలని నిశ్చయించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏళ్లుగా ఏకధాటిగా వెలిగిన అమర జవాను జ్యోతి ఆరిపోనుంది.అటు..కేంద్రం నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దేశం కోసం అమరులైన వారిని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించదని అంటున్నారు. జవాన్ల త్యాగాలకు బీజేపీ విలువ ఇవ్వదని ధ్వజమెత్తుతున్నారు.
దేశభక్తిని,త్యాగాన్ని కొంత మంది అర్థం చేసుకోలేకపోతున్నారని..బీజేపీని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. శౌర్యపరాక్రమాలు చాటిన జవాన్ల త్యాగానికి గుర్తుగా వెలిగిన జ్యోతి ఆరిపోవటం విచారకరమని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.అయితే, ఇది తాత్కాలికమేనని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అమర జవాను జ్యోతి మళ్లీ వెలుగుతుందని రాహుల్ హామీ ఇచ్చారు.
ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పింది. తాము అమరజ్వోతి ఆర్పేయడం లేదని.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతితో కలుపుతున్నామని చెప్పారు. ఇండియా గేట్ మీద ముద్రించిన జవాన్ల పేర్లలో 1971 యుద్ధంలో మరణించిన వీరుల పేర్లు లేవని గుర్తు చేసింది. అక్కడ మొదటి ప్రపంచ యుద్ధం, అఫ్గాన్-ఆంగ్లో యుద్ధంలో అమరులైన వారి పేర్లు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్పారు.
ఇది బ్రిటిష్ కాలంలో జరిగిన సంఘటనలు గుర్తు చేస్తుందని.. స్వతంత్ర భారత విజయాలకు గుర్తుగా జాతీయ యుద్ధ స్మారకంలో అందరి పేర్లు ఉంటాయని వివరించారు. అమర జవాన్లకు ఇదే నిజమైన శ్రద్ధాంజలని చెప్పారు. ఏడు దశాబ్దాల్లో జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించలేని వాళ్లు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని బీజేపీ పెద్దలు ప్రతిపక్షాలపై మండిపడ్డారు.