దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఆందోళన 40వ రోజుకు చేరింది. నిరసన చేస్తున్న రైతులతో మరోసారి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధమవుతోంది. ఇరు వర్గాల ప్రతినిధుల మధ్య చర్చలు జరగడం ఇది ఏడోసారి. కాగా ఈసారి ఎలాగైనా మధ్యేమార్గంగా రైతులు ఆందోళన విరమించేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. నేటి చర్చల్లో ఏం చేయాలనే దానిపై ఇప్పటికే కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
రైతులు ప్రధానంగా రెండు అంశాలనే ప్రస్తావిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ రెండింటినీ అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. చట్టాల ఉపసంహరణ కుదిరే పని కాదు కాబట్టి.. కనీస మద్దతు ధరకు చట్టబద్దత విషయంలో కొంత సానుకూలత వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు రెండో డిమాండ్‌కు ఓకే చెప్పే అవకాశాలు కన్పిస్తున్నాయి., దీంతో ఈసారి కూడా చర్చల్లో సమస్య పరిష్కారం అనుమానంగానే కనిపిస్తోంది. ఈసారి చర్చలు సఫలం కాకపోతే తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేయబోతున్నట్టు ఇప్పటికే రైతు సంఘాలు కేంద్రాన్ని హెచ్చరించాయి.