అంతంతమాత్రంగా కొనసాగుతోన్న ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ దోస్తానా ముగింపు దశకు చేరుకుందా…? గతంలో చూసిచూడనట్లు వదిలేసిన కేంద్రం ఇప్పుడు అన్నీ అంశాలపై క్లారిటీ కోరుతోందా…? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
ఇప్పటికే ఆర్టీసీ సమ్మె విషయంలో షాక్ ఇచ్చిన మోడీ సర్కార్… ఇప్పుడు డబుల్ బెడ్ రూం ఇండ్ల అంశంలోనూ షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిసోన్న డబుల్ బెడ్‌రూం ఇండ్లకు కేంద్రం కూడా సహయం చేస్తోంది. అయితే… కేంద్రం నుండి రావాల్సిన 1800కోట్ల బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా, లబ్ధిదారుల లిస్ట్ ఇస్తే బకాయిలు విడుదల చేస్తామని… ఇండ్లు ఎవరికి ఇచ్చారో తెలియకుండా ఎలా నిధులు ఇస్తారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మొదటిదశలో భాగంగా కేంద్రం 1200కోట్ల రూపాయలను విడుదల చేయగా, మరో రెండు విడతల బిల్లులు పెండింగ్‌లో పెట్టేసింది. కేంద్రం ఒక్కో లబ్ధిదారుడికి లక్షన్నర సహయం చేస్తుండగా… రాష్ట్రప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న ఒక్కో ఇళ్లు నిర్మాణానికి 5లక్షల నాలుగు వేల రూపాయల ఖర్చవుతున్నట్లు ప్రకటించింది. ఇక పట్టణాల్లో 5.25 లక్షల వరకు కాంట్రాక్టర్లకు చెల్లిస్తోంది. ఇసుక ఉచితంగా సప్లై చేస్తోంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న ఇండ్లకు 1500కోట్ల బిల్లులు రావాల్సి ఉన్నా… 600కోట్లు చెల్లించింది. అందులో 900కోట్లు పెండింగ్ ఉండగా, జిల్లాలో నిర్మిస్తోన్న ఇండ్ల బకాయిలు మరో 900కోట్లు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వ వర్గాలంటున్నాయి.
అయితే, ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తూ, నిర్మించుకుంటూ పోతే ఎప్పటికి పూర్తవుతాయో, ఎప్పుడు లబ్ధిదారులకు కేటాయిస్తారో చెప్పకుండా… బిల్లులు ఎలా ఇస్తామని కేంద్రం ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల వివరాలు వచ్చిన వాటికే బిల్లులు చెల్లిస్తామని తేగేసి చెప్పినట్లు సమాచారం.