కరోనా నిబంధనలను కఠినతరం చేయాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు అమలు చేయాలని తెలిపింది. జిల్లాలు, స్థానిక పరిస్థితులపై కరోనా ప్రభావాన్ని అంచనా వేసి తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపింది. పండగల సీజన్ మొదలవుతోంది కనుక మహమ్మారి వ్యాప్తికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. డెల్టా వేరింయట్ కంటే ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండటంతో పండగల సీజన్ లో ఆంక్షలు తప్పవని రాష్ట్రాలకు పంపిన లేఖలో వివరించింది. అవసరమైతే నైట్ కర్ఫ్యూలు అమలు చేయాలని.. భారీ సమావేశాలు పూర్తిగా రద్దు చేయాని, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వచ్చే వారి సంఖ్యను తగ్గించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రాలకు సూచించింది.
భారత్ లో ఇప్పటి వరకు 578 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఢిల్లీలో 142, మహారాష్ట్రలో 141 మంది ఒమక్రాన్ బాధితులు ఉన్నారు. పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూలు అమలులో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలను కూడా రద్దు చేశాయి.