సోషల్ మీడియా సంస్థలు వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం చేస్తున్నాయని దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. కేంద్రం ఈ అంశంపై సీరియస్‌గా దృష్టిసారించింది. సమాచార దుర్వినియోగం కేవలం వ్యక్తులకే గాక… భవిష్యత్తులో దేశానికి కూడా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నందున అప్రమత్తమైంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్, ట్విట్టర్ సంస్థలకు ఐటీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమన్లు జారీచేసింది.
ఫేస్‌బుక్, ట్విట్టర్ అధికారులు ఈ నెల 21వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. సోషల్ మీడియాలో గోప్యత, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం- నివారణ, సోషల్ మీడియాలో మహిళలకు భద్రత అంశాలపై చర్చించాల్సి ఉందని అందులో తెలిపింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై పెనుదుమారం రేపిన వేళ.. తాజా సమన్లు జారీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.