-దేశంలో భయపెడుతున్నకేసులు
-ఒమిక్రాన్ తో భయం వద్దు:నిపుణులు
-వారికి మాత్రం వర్క్ ఫ్రం హోం
-వ్యాప్తి ఎక్కువున్నచోట..ఇలా?
-కొవిడ్ తాజా పరిస్థితిపై పీఎం సమీక్ష
ఢిల్లీ, తొలివెలుగు: భారత్ లో నమోదువుతున్న కరోనా కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఓవైపు కేసుల సంఖ్య, మరోవైపు పాజిటివిటీ రేటు విపరీతంగా పెరుగుతోంది. పెరుగుతున్న కేసులు వైద్య అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 24 గంటల్లో 1,59,632 మంది కరోనా బారిన పడ్డారు. మూడు రోజుల క్రితం లక్ష లోపు కేసులు ఉండగా.. ఇప్పుడు రెండు లక్షల దిశగా పోతున్నాయి.
ఈనేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ పై ప్రజల భయాలను కేంద్రం తోసిపుచ్చింది. ప్రధాని మోడీ అధ్యక్షతన నిన్న జరిగిన సమీక్షలో కొన్నికీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులపై వివిధ రాష్ట్రాల ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, సంబంధిత మంత్రిత్వశాఖలు, అధికారులతో జరిపిన వర్చువల్ మీటింగ్ లో మోడీ కొన్నిసూచనలు చేశారు. ముఖ్యంగా వైరస్ కట్టడికి చర్యలు, ఆక్సిజన్ నిల్వల గురించి, వ్యాక్సినేషన్ ప్రక్రియ పురోగతి ఇలా వివిధ అంశాలపై మోడీ ఆరా తీశారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే ఏ రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభణ ఎక్కువగా ఉందనే దానిపై సమీక్షించి, జోన్ల వారీగా చర్చలు జరిపారు. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నచోట అధికారులు సైతం వర్క్ ఫ్రం హోం చేయాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్ జాబితా నుంచి తొలగించాకే కార్యాలయానికి రావాలని సూచించింది. అటు.. దివ్యాంగులు, గర్భిణులు ఇంటి నుంచే పనిచేసేలా వెసులుబాటు కల్పించారు. క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ పై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా అటు కరోనా, ఇటు ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఈ రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలపై చర్చ జరిపారు.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా సమీక్ష చర్పించినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో మహమ్మారి వ్యాప్తికి ఎలాంటి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. కరోనా వ్యాప్తికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో అవరసమైతే ఎన్నికల ప్రచారానికి పరిమితులు విధించేలా చర్యలు తీసుకునేలా చర్చించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేసేందుకు సమాలోచనలు చేశారు. వ్యాక్సినేషన్ లో వెనకబడిన రాష్ట్రాల్లో ఉన్న సమస్యలను అధిగమించి టీకాలు సంఖ్య పెంచేందుకు మార్గాలను అన్వేషించారు.