దేశంలో సర్వికల్ క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సర్వికల్ క్యాన్సర్‌లో ప్రపంచంలో భారత్ నాల్గవ స్థానంలో ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో గర్భాశయ క్యాన్సర్ కు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలోని 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు ఈ వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మహిళల్లో అత్యధిక మరణాలకు కారణమవుతున్న సర్వికల్ క్యాన్సర్స్‌ను నిరోధించేందుకు వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్టు తెలిపింది. దీనిలో భాగంగా ఈ ఏడాది జూన్‌లో తొమ్మిది నుండి 14 ఏండ్ల బాలికలకు జాతీయ రోగనిరోధకత కార్యక్రమంలో హెచ్ పీవీ వ్యాక్సిన్‌ను కేంద్రం ఇవ్వనున్నట్టు సమాచారం.
ఈ కార్యక్రమంలో భాగంగా 9-14 ఏండ్ల బాలికలకు ఈ వ్యాక్సిన్ ను ఉచితంగా వేయనున్నారు. గర్భాశయ క్యాన్సర్ వ్యాప్తిని అడ్డుకోవడంలో హెచ్ పీవీ చాలా కీలకమైనదని వైద్యులు చెబుతున్నారు. హెచ్ పీవీ 16 కోట్ల డోసులకు ఏప్రిల్లో టెండర్ల ప్రక్రియన నిర్వహిస్తారని తెలుస్తోంది.
దేశంలో ప్రతి యేటా సర్వికల్ క్యాన్సర్ బారిన పడి 35 వేల మంది స్త్రీలు మరణిస్తున్నారు. ఈ క్రమంలో బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్లు ఇవ్వాలన్న ఆలోచన హర్షణీయమని పలువురు అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే దేశంలోని ప్రతి జిల్లాలో 5 నుంచి 10వ తరగతి వరకు బాలికల సంఖ్యను సేకరించి ఆ జాబితాను పంపాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్రం ఇప్పటికే ఆదేశించింది.