కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా భయపెడుతుందో తెలిసిందే. అగ్రారాజ్యం అమెరికాను కకావికలం చేస్తుంది. ప్రపంచదేశాల రారాజు అయిన బ్రిటన్ ప్రధానినే మంచానికి పరిమితం చేసింది. ఇక చైనాను ఎంత వణికించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఇండియాలోనూ క్రమంగా కరోనా వైరస్ తన దూకుడు ప్రదర్శిస్తుంది. కానీ పరిస్థితి అయితే కంట్రోల్ లోనే ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి.
అయితే, ఇండియాలో జనసాంద్రత, జనాభా ఎక్కువగా ఉండటంతో… భారత్ లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు. అయితే… ఇప్పటి వరకు పూర్తిగా అదుపులోనే ఉన్నప్పటికీ, ఎలా కరోనా విస్పోటనం చెందుతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి. అయితే, భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉండటంపై కరోనా టెస్టులు ఎక్కువగా చేయటం లేదన్న విమర్శ ఉంది. అమెరికా అధ్యక్షుడు సైతం తమ దేశంలో ఎక్కువగా టెస్టులు చేయటం వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది అంటూ ప్రకటించాడు.
అయితే, దీనిపై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ ను గమనిస్తూ… మనం పనిచేస్తున్నాం. పోలియో సహా ఎన్నో వ్యాధులను సమర్థవంతంగా అరికట్టిన నైపుణ్యం మనది. చైనాలో కరోనా వైరస్ రిపోర్టు అయిన దగ్గర నుండి అన్నీ గమనిస్తున్నామని స్పష్టం చేశారు. గత ఐదు రోజుల వరకు రోజుకు 2000మందికి మాత్రమే కరోనా టెస్టులు చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క రోజుకు 12వేల టెస్టులు చేస్తున్నాం. 119 ల్యాబులు అందుబాటులోకి వచ్చాయని, 28వేల కేసులు ఓకే రోజులో టెస్ట్ చేయగల సామర్థ్యం ఇండియాకు అతి త్వరలో వస్తుందని స్పష్టం చేశారు.
ఇక అమెరికాతో పోల్చితే… మన దగ్గర వెంటిలేటర్స్, ఐసీయూ బెడ్స్ తక్కువగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ పరిస్థితి ఎంతదూరం వెళ్లినా ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికతో ఉన్నామని, 15శాతం సీరీయస్, 5శాతం అత్యంత సీరీయస్ కేసులు ఉంటాయని…వారికే వెంటిలేటర్, ఐసీయూ బెడ్స్ అవసరం పడతాయని అంచానా వేస్తూ, ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.
భారత శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగాలను బేరీజు వేస్తూ… మన దగ్గర కూడా పనిచేస్తున్నారని, ఖచ్చితంగా సమర్థవంతంగా ఎదుర్కోబోతున్నామని స్పష్టం చేశారు మంత్రి.