విభజన చట్టంలో అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అటకెక్కుతున్నాయి. ఏదో ఒక కారణం చెప్పి కేంద్రం మంగళం పాడేస్తోంది. ప్రత్యేక హోదా హామీకి ఎప్పుడో పాతరేసిన కేంద్రం.. స్పెషల్ ప్యాకేజీ పేరుతో సైడ్ అయింది. ఆతర్వాత పోలవరం నిధులపై మాట మార్చింది. ఇక విశాఖకు రైల్వే జోన్ అంటూ జస్ట్ ప్రకటన ఇచ్చేసి చేతులు దులుపుకుంది. కనీసం ఇప్పటిదాకా ఆయా హామీల లాభాన్ని తగ్గించడమో లేక.. మార్పులు చేయడమో చేసుకుంటూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఓ హామీతో అసలు సంబంధమే లేదంలూ తేల్చిపారేసింది.
ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్ట్‌ను అభివృద్ధి చేయలేమని కేంద్రం కుండ బద్దలు కొట్టింది. కేంద్రం మేజర్ పోర్టులను మాత్రమే చేపడుతుందని స్పష్టం చేసిన కేంద్రం.. అక్కడ నాన్-మేజర్ పోర్టు ఏర్పాటు కోసం రాష్ట్రప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి 20నే నోటిఫికేషన్ జారీచేసినట్టు గుర్తు చేసింది. నాన్-మేజర్ పోర్టుల నిర్మాణం, అభివృద్ధి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని పార్లమెంట్ సాక్షిగా పకటన చేసింది. రాజ్యసభలో బీజేపీ సభ్యులు టీజీ వెంకటేశ్, జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఓడరేవులు, నౌకాయాన మంత్రి మన్‌సుఖ్ మాండవియా ఈమేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇండియన్ షిప్ పోర్ట్స్ యాక్ట్-1908 ప్రకారం మేజర్ పోర్టుల అభివృద్ధి మాత్రమే కేంద్రం బాధ్యత అని ఆయన వివరించారు. తాజా ప్రకటనతో రామాయపట్నం కథ కంచికేనని స్పష్టమవుతోంది.