ఆన్‌లైన్ విద్య అంతా మిథ్యేనా? ఈ- ఎడ్యుకేషన్ పిల్లలని మళ్లీ రెండేళ్ల క్రితం నాటికి తీసుకెళ్లిందా? అంటే అవుననే అంటున్నాయి అధ్యయనాలు. ముంబై సహా దేశంలోని ముఖ్యనగరాల్లో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సరళిపై చేసిన సర్వేల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. ఆన్‌లైన్ క్లాసులకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వాలు తామేదో గొప్ప పనిచేశాయని అనుకుంటున్నాయేమోగానీ.. వాస్తవానికి తెలిసి తెలిసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. అటు స్కూళ్లల్లో, ఇటు ఇళ్లల్లో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కు అవసరమైన కనీస సదుపాయలు లేకపోయినప్పటికీ.. ప్రభుత్వాలు విద్యా సంవత్సరాలను ప్రారంభించడం, ముగించడం, పరీక్షలు లేకుండానే ఫలితాలలను ప్రకటిస్తున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోందని అంటున్నారు.
ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన రిపోర్ట్‌ను చూస్తే.. దేశంలో సగటున 37 శాతం స్కూళ్లలోనే కంప్యూటర్లు ఉన్నాయని తేలింది. అందులోనూ 22 శాతం పాఠశాలల్లో మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఉందని తెలిపింది. పైగా ఈ లెక్క ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటి వివరాలతో కూడినది. కేవలం ప్రభుత్వ పాఠశాలల వివరాలనే తీసుకుంటే.. కేవలం 11 శాతం స్కూళ్లలో మాత్రమే ఇంటర్నెట్‌తో కూడిన విద్యాబోధనకు అవకాశం ఉందని స్వయంగా కేంద్రమే ఒప్పుకుంది. అంటే సర్కారు బడుల్లో విద్యార్థుల చదువుల ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
ఉదాహరణకు ముంబై నగరాన్ని తీసుకుంటే.. ఆన్‌లైన్ విద్య గందరగోళంగా ఉందని తాజా అధ్యాయనంలో తేలింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు.. బృహత్ ముంబై కార్పొరేషన్ అధికారులు చెబుతున్నప్పటీకీ.. అది విద్యార్థులకు చేరుతున్న విధానం ఒకేలా లేదు. ఆన్‌లైన్ తరగతులను వినే ఆర్థిక పరిస్థితులకు అనేక కుటుంబాల్లోని పిల్లలు నోచుకోవడం లేదు. రోజంతా కష్టపడితే తప్ప పూట గడవని స్థితిలో ఉన్న కుటుంబాలు.. తమ పిల్లలకు ఆన్‌లైన్ విద్యను అందించలేక అపసోపాలు పడుతున్నాయి. చాలా కుటుంబాల్లో పిల్లలు ఇద్దరో ముగ్గురో ఉంటే.. ఇంట్లో ఒక్క ఫోనే ఉండటంతో ఏడాదికాలంగా ఎవరి చదువూ సాఫీగా సాగలేదు. మరో ఫోన్ కొందామంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలించని కుటుంబాలు వేల సంఖ్యలోనే ఉన్నట్టు తేలింది. ఇక మరికొన్ని కుటుంబాల్లో విద్యార్థి ఒకరే ఉన్నప్పటికీ.. కుటుంబ సభ్యులకు వచ్చే ఫోన్లను కూడా లిఫ్ట్ చేసి మాట్లాడాల్సి రావడంతో.. ఆన్‌లైన్ తరగతులకు బ్రేక్ పడేది. నిత్య అందే తంతూ కావడంతో.. చాలా మంది తామేం నేర్చుకున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు.
నగరాలకు వలస వెళ్లి జీవిస్తున్న వారి కుటుంబాల పిల్లలది మరో సమస్య. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. తమతో పాటు తమ పిల్లలని కూడా వెంట తీసుకెళ్లారు. అలా దాదాపు 30 శాతం మంది విద్యార్థులు.. చదువులని మధ్యలోనే ఆపేశారు. కొంత మంది ఫోన్లలో డేటాను కూడా వేయించుకోలేని పరిస్థితుల్లో ఆగిపోతే.. మరికొంత మంది సిగ్నల్స్ సరిగ్గా లేక ఆన్‌లైన్ మార్గం పట్టలేకపోయారు.
ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్ క్లాసులతో పాటు యూట్యూబ్‌లోనూ పాఠాలను అందుబాటులో ఉంచుతున్నారు. కానీ కచ్చితంగా చదవాలనే ఆజమాయిషీ లేక విద్యార్థులు వాటిని వదిలేస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో స్మార్ట్ ఫోన్లలో.. చదువులు, క్లాసులు వినడం కన్నా వీడియో గేమ్స్, వినోద కార్యక్రమాలని చూసేందుకే అసక్తి చూపించారు. ఈ సమస్యలను గుర్తించి కొన్ని చోట్ల మునుపటి తరగతుల్లోని సబ్జెక్టులను కూడా కొన్నాళ్లు బోధించి.. పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటీకీ.. మరెన్నీ ఆలోచనలు చేసినప్పటికీ.. ఆన్‌లైన్ విద్యాభ్యాసం .. విషాదగీతమే అవుతోంది.