లాక్ డౌన్ ను సీరియస్ గా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. లాక్ డౌన్ ను పట్టించుకోకుండా ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దేశంలోని 80 జిల్లాలను షట్ డౌన్ చేశారు. దేశవ్యాప్తంగా 4 వందలకు పైగా వైరస్ బారిన పడ్డారు.
”చాలా మంది లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు..దయచేసి మీ జీవితాలను కాపాడుకోండి..మీ కుటుంబాన్ని రక్షించుకోండి…ప్రభుత్వ సూచనలను సీరియస్ గా ఫాలో కండి…నిబంధనలను కఠినంగా అమలయ్యేగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను” అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చిన వారిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తుంది.
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా 80 జిల్లాలు పూర్తిగా లాక్ డౌన్ పాటిస్తున్నాయి. అత్యవసర సర్వీసులు మాత్రమే పనిచేస్తున్నాయి. రైల్వేలు, మెట్రోలు, అంతఃరాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. పంజాబ్, రాజస్థాన్, బెంగాల్, హర్యానాల్లో పబ్లిక్ టాన్స్ పోర్ట్ ను బంద్ చేశారు.
మరోవైపు కరోనా అనుమానితులు ఎక్కువైతున్నందున దేశవ్యాప్తంగా టెస్టింగ్ ల్యాబరేటరీలను పెంచింది.