పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తపడాలని సూచించింది. ముఖ్యంగా హింసను ప్రేరేపించే విధంగా అసత్య వార్తలు ప్రచారం చేసే వారిపైనా, సోషల్ మీడియా పోస్టులు చేసే వారి పైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కొన్ని జాగ్రత్తలతో కూడిన సూచనలను కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు పంపింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది.
పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్శి, క్రిస్టియన్ మతాలకు చెందిన వారికి భారత్ పౌరసత్వం కల్పించేందుకు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో మొదట ఆందోళనలు చెలరేగి దేశవ్యాప్తంగా విస్తరిస్తుండడంతో కేంద్ర హోంశాఖ పై రాష్ట్రాలను హెచ్చరించింది.