హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కేంద్రమంత్రికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారి పవిత్ర మందిరాన్ని చేరుకోవడం, ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఆ తర్వాత కేసీఆర్ సర్కార్ పై కేంద్రమంత్రి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీగా ఉందని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ వెనుక పడిపోయిందన్నారు. కేంద్ర ప్రాజెక్టులకు సహకరించకుండా.. కేసీఆర్ సర్కార్ కేంద్రంపై నిందలు వేస్తోందన్నారు. బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల హామీలు నెరవేర్చకుంటే తల నరుక్కుంటామన్న కేసీఆర్ ఇప్పుడేమంటారు? అని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్దికి ప్రధాని మోడీ పెద్ద మనస్సుతో సహాకరిస్తున్నారని పేర్కొన్నారు. దళిత సీఎం, మూడెకరాల భూమి, పక్కా ఇళ్ళు హామీలు ఎందుకు అమలు చేయటం లేదని నిలదీశారు.
ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్.. తన కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాడని విమర్శించారు. ప్రాణత్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రానికి దక్కలేదన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు తరిమికొట్టే సమయం దగ్గరలోనే ఉందన్నారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.