ఆంధ్రప్రదేశ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి దేవుసిన్హ చౌహాన్. ఈ సందర్భంగా ఆయన మంగళవారం కర్నూలులో మీడియాలో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏపీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్నారు. గుడ్ గవర్నెన్స్ అందించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. అతి తక్కువ సమయంలోనే ఏపీ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు సద్వినియోగం చేసుకోవడంలో జగన్ సమర్థుడు కాదంటూ విమర్శలు చేశారు.
గ్రామీణాభివృద్ధికి 14, 15వ ప్రణాళిక సంఘం నిధులను ప్రభుత్వం వేరే మార్గంలో వాడుకుందని ఆరోపణలు చేశారు. ఇది గ్రామ స్వరాజ్యంపై దాడిగా చౌహాన్ అభివర్ణించారు. ఇకపై ఏపీలో ప్రతీ నెల ఒక కేంద్ర మంత్రి విజిట్ చేస్తారని ఆయన వెల్లడించారు. పంచాయతీలకు ఇచ్చే నిధులు గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు.
రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, సిబ్బంది జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. వాలంటీర్లకు జీతాలు సరైన సమయంలో ఇస్తున్నారని కానీ.. ఉద్యోగస్తులకు మాత్రం జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఇది ప్రజా స్వామ్యం కాదన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉందని.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఒక్క సీటు కూడా రాదని అన్నారు.
20 లక్షల గృహాలను కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ కి మంజూరు చేసిందని, కానీ ఇక్కడ ఒక్క ఇల్లు కూడా నిర్మించడం లేదన్నారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఆయుష్మాన్ కార్డు పేదలకు ఇవ్వడం లేదన్నారు. ఏపీలో ప్రతీ వ్యక్తికి ప్రధాని మోడీ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు కేంద్ర మంత్రి దేవుసిన్హ చౌహాన్.