సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అగ్ని ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే డెక్కన్ నిట్ వేర్ ఘటనలో మంటల ధాటికి పక్కనే కాలనీలో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. అనంతరం సహాయ శిబిరంలో ఉన్న స్థానిక ప్రజలతో మాట్లాడారు కిషన్ రెడ్డి.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. జనావాసాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో నిర్వహిస్తున్న వేర్ హౌజ్ లు, గోడౌన్లపై సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని నగరం వెలుపలికి తరలించాలన్నారు. మంటల ధాటికి కాలనీలో దెబ్బతిన్న జానావాసాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు కిషన్ రెడ్డి.
కాగా సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేట డెక్కన్ నైట్ వేర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 12 గంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయి. ఇప్పటి కూడా లోపలికి వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. మంటల ధాటికి భవనం పూర్తిగా దెబ్బతింది.
మంటలు ఆర్పే క్రమంలో ఏపీఎఫ్ వో ధనుంజయ రెడ్డి, ఫైరింజన్ డ్రైవర్ నర్సింగ రావు అస్వస్థతకు గురయ్యారు. ఏకంగా 20 నుంచి 30 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాద ఘటనలో ఐదుగురిని కాపాడగా.. ముగ్గురు మృతి చెందారు.