టీఆర్ఎస్ సర్కార్ టార్గెట్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర కొనసాగుతోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో యాత్ర కొనసాగింది. తెలంగాణ ప్రజలను కేసీఆర్ అవమానించారని ఆరోపించారు కిషన్ రెడ్డి. అంబర్ పేట నియోజకవర్గంలో ఆయన కంటతడి పెట్టారు. అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలకడంతో కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. తాను కేంద్రమంత్రి అయ్యానంటే.. అంబర్ పేట, సికింద్రాబాద్ ప్రజల ఆశీర్వాదమేనని అన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఏ అధికారి ఎక్కడుంటారో తెలియని గందరగోళ పరిస్థితి ఉందని విమర్శించారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడి చేతిలో తెలంగాణ బందీ అయిందని.. బంధ విముక్తి కోరుకుంటోందని చురకలంటించారు.
ఇక సీతాఫల్ మండి నుంచి చిలకలగూడ వెళ్లే మార్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రలో పాల్గొన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వలేని కేసీఆర్… దళితబంధు ఎలా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల కోసమే సీఎం పనిచేస్తారని ఆరోపించారు. దళిత బంధు పేరుతో మరోసారి దళితులను మోసం చేస్తున్నారని… కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు బండి సంజయ్.