ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర విజయవాడలో జరిగింది. బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం జరిగిన సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వచనం తీసుకునేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇందులో మంత్రులు పాల్గొంటున్నారని చెప్పారు. అనంతరం కిషన్ రెడ్డి ప్రసంగించారు.
ఆర్టికల్ 370ని తొలగిస్తామని పార్టీ స్థాపించినప్పటి నుండి హామీ ఇచ్చాం.. ఇచ్చిన మాటకు కట్టుబడి రద్దు చేశామన్నారు కిషన్ రెడ్డి. ఆ సమయంలో తాను హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని.. ప్రధాని మోడీ ఢిల్లీలో లాబీయింగ్ లేని పాలన అందిస్తున్నారని కొనియాడారు. నూతన మంత్రులను లోక్ సభలో పరిచయం చేయడానికి మోడీ ప్రయత్నిస్తే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు కిషన్ రెడ్డి.
కేంద్రం అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తోందని చెప్పిన కిషన్ రెడ్డి.. రైతులకు సంవత్సరానికి రూ.6వేలు ఇస్తున్నట్లు చెప్పారు. మాస్క్ లేకుండా ఎవరూ బయటకు రావొద్దని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే థర్డ్ వేవ్ రాకుండా చేయొచ్చని అన్నారు. కరోనా వ్యాక్సిన్ ను ప్రతీ ఒక్కరికీ అందిస్తామని చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి.