కరోనా మహమ్మారి ఎంతకీ తగ్గనంటోంది. రోజురోజుకీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ వస్తుందేమోనని భయపడిపోతున్నారు ప్రజలు. థర్డ్ వేవ్ వస్తే మాత్రం పిల్లలపై ప్రభావం ఉంటుందని ఇప్పటికే హెచ్చరించారు నిపుణులు. దీంతో తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొని ఉంది. అయితే థర్డ్ వేవ్.. చిన్నారులపై ప్రభావం లాంటి భయాల్లో ఉన్న ప్రజలకు తీపి కబురు అందించింది కేంద్రం.
అతి త్వరలోనే చిన్నారులకు కరోనా టీకాలు వేయనున్నట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. పిల్లల వ్యాక్సిన్ కు సంబంధించిన ట్రయల్స్ జరుగుతున్నాయన్న ఆయన.. జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న టీకాల ట్రయల్స్ ఫలితాలు వచ్చే నెలలో విడుదల అవుతాయని చెప్పారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్ ఉంటుందని తెలిపారు.