కేంద్రమంత్రి నారాయణ్ రాణె అరెస్ట్ తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు ఇంట్రస్టింగ్ గా మారాయి. రెండు పార్టీల నేతలు మాటల దాడి పెంచారు. ఏం అంశాన్ని వదలకుండా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా వినాయక చవితి ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంతో కేంద్రమంత్రి నారాయణ్ రాణె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్ ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అంటూ ఆరోపించారు.
కరోనా నేపథ్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలపై ఆంక్షలు విధించింది ఉద్ధవ్ సర్కార్. కేవలం హిందువుల పండుగల సమయంలోనే ఆంక్షలు గుర్తొస్తాయా అని ప్రశ్నించారు రాణె. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంతోనే శివసేన తన సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చిందంటూ కామెంట్ చేశారు. రాణె వ్యాఖ్యలపై శివసేన నేతలు భగ్గుముంటున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో జాగ్రత్తలు పాటించాలని తెలియదా..? అని కౌంటర్ ఇస్తున్నారు.
సీఎం ఉద్ధవ్ చెంప పగులగొడతానని ఇటీవల నారాయణ్ రాణే కామెంట్స్ చేశారు. ఆ సమయంలో ఆయనపై కేసులు నమోదై అరెస్ట్ కూడా అయ్యారు. అప్పటినుంచి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.