హైదరాబాద్: పవర్ ప్రాజెక్టులపై సీఎం జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి పీపీఏలను రద్దు చేయాలని మంకుపట్టు పడుతున్నారని, దీనివల్ల వచ్చే పెట్టుబడులు కూడా పోతాయని ఎంత చెప్పినా జగన్ వినడం లేదని అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో కేంద్ర మంత్రి ఈ అంశంపై మాట్లాడారు. చంద్రబాబు హయాంలో పీపీఏలలో అవకతవకలు జరిగినట్టు జగన్ తమ దగ్గరికి లేఖలతో వచ్చి రద్దు చేయమని కోరుతున్నారని, దీనివల్ల పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అవకతవకలు జరిగినట్టుగా ఎక్కడా ఆధారాలు లేవని, సరైన ఆధారాలు లేకుండా పీపీఏను రద్దు చేయాలని సీఎం కోరుతున్నారని కేంద్రమంత్రి ఆరోపించారు. సీఎం జగన్ వైఖరి పెట్టుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, పవర్ ప్రాజెక్టులపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.