ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ…నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలు అంశం రాజకీయ పార్టీలకు హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ అంశంపై ఓట్లు సంపాదించేందుకు రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు ఆప్… ఇటు బీజేపీ… దోషులకు సకాలంలో ఉరిశిక్ష అమలులో తప్పు మీదంటే..మీదంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి. దోషులకు శిక్ష అమలును కొన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని నిర్భయ తల్లి ఆశాదేవి స్వయంగా ఆరోపించారు. సంఘటన జరిగి ఏడేళ్లయిన నిర్భయ దోషులకు ఇప్పటి వరకు శిక్ష అమలు కాకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆప్ పై ఆరోపణలు చేశారు. దోషుల రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు గత సంవత్సరమే కొట్టేసినప్పటికీ ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కారణంగానే నలుగురు దోషులకు సకాలంలో ఉరిశిక్ష అమలు కాలేదని అన్నారు. 2018 జూలైలో రివ్యూ పిటిషన్ కొట్టేసినప్పటికీ ఆప్ ప్రభుత్వ చేతిలో ఉన్న జైళ్ల శాఖ నిద్రపోతుందా అని ప్రశ్నించారు. నిర్భయ కేసులో మైనరైన రేపిస్టును విడుదల చేసినప్పడు ఆప్ ప్రభుత్వం అతనికి కుట్టు మిషన్ కొనుక్కోమని ప్రభుత్వం రూ.10000 ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు? నిర్భయ తల్లి కళ్లలోని కన్నీళ్లను వాళ్లు చూడలేదా..?అని మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు.
”నేను ఆమ్ ఆద్మీ పార్టీని ఒకటే అడుగుతున్నాను…రివ్యూ పిటిషన్ తిరస్కరించినప్పటికీ మీ కారణంగానే దోషులకు ఉరిశిక్ష అమలు చేయనిది నిజం కాదా..? ఇలాంటి పార్టీలు సిగ్గుపడాలి…ఇది మా ఒక్క పార్టీ అభిప్రాయమే కాదు..దేశంలోని చట్టాన్ని గౌరవించే ప్రతి ఒక్కరి అభిప్రాయం” అన్నారు స్మృతి ఇరానీ.