ఆయన అవటానికి మహారాష్ట్ర అయినా, ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడు. అందుకే బాధ్యతగా లేఖ రాశారో.. లేక ఎవరైనా ఆయనను ఇన్ ఫ్లూయెన్స్ చేసి రాయించారో తెలియదుగాని.. ఆయన రాసిన లేఖలు ఇప్పుడు సంచలనం అయ్యాయి. ఎందుకంటే ఒకప్పుడు రైల్వే శాఖా మంత్రిగా పని చేసిన సురేష్ ప్రభు అందరి నుంచి అభినందనలు అందుకున్నారు. ఆయన శివసేన నుంచి గెలిచినా.. వెంటనే మంత్రిని చేసి.. అందుకు శివసేన ఒప్పుకోకపోతే.. బిజెపిలో చేర్చుకుని మరీ మంత్రిగా కొనసాగించారు నరేంద్ర మోదీ. అలాంటి నేత ఇప్పుడీ లేఖ రాయడం ఆసక్తికరమే. కేంద్ర మాజీ మంత్రి, బిజెపి ఎంపీ సురేష్ ప్రభు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు, వాణిజ్యశాఖా మంత్రి పీయూష్ గోయెల్ కు ఓ లేఖ రాశారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్ధితి మీద. నరేష్ కుమార్ అనే ఏపీ ఛాంబర్స్ ప్రతినిధి నుంచి ఒక లేఖ తనకు వచ్చిందని.. అందులోని విషయాలు నిజమేనని.. వెంటనే చర్యలు తీసుకోవాలని.. ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా దారుణంగా దెబ్బ తినక ముందే మేలుకోవాలని కూడా సురేష్ ప్రభు లేఖ రాశారు.
నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏపీ సర్కార్.. అందుకు అవసరమైన నిధుల కోసం కార్పొరేషన్ల ఫండ్స్, ఇతర ఫండ్స్ ను ఎడాపెడా డైవర్ట్ చేసేసి వాడేస్తోంది. ఎఫ్ఆర్బీఎమ్ లిమిట్ దాటి మరీ నిధులను అప్పులుగా తెచ్చేసుకుంటుంది. వీటన్నిటిని ఇన్ ఫ్రా అభివృద్ధికి కూడా కాకుండా కేవలం సంక్షేమ పథకాలకే ఖర్చు పెట్టేస్తోంది. ఎందుకంటే ఆ నవరత్నాలు అమలు చేశామని చెప్పుకోవడానికి, ప్రజలకు నేరుగా నగదు అందించి.. వారిని రాజకీయంగా తమవైపు తిప్పుకోవడానికే ఈ పని చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అదే విషయాన్ని నరేష్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. దానినే సురేష్ ప్రభు రిఫర్ చేశారు.
ఇప్పటికే అనేక మార్గాల్లో అప్పుల కోసం ప్రయత్నిస్తున్న ఏపీ సర్కార్.. కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్ల నుంచి కూడా అప్పుల కోసం బ్యాంకులకు వెళ్లింది. కాని బ్యాంకులు తిరస్కరించాయ్. అలాగే ఎఫ్ఆర్భీఎం లిమిట్ పెంచుకోవడం కోసం.. కేంద్రం రైతులకు విద్యుత్ మీటర్లు వంటి సంస్కరణలు అమలు చేయాలని కండిషన్ పెడితే.. అందుకు ఒప్పేసుకుని 5 వేల కోట్లు వెంటనే తీసేసుకున్నారు. అది కూడా అప్పే. అంటే అప్పు చేయడానికి కూడా కేంద్ర నిబంధనలు ఓకె చేసేశారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చినా.. అది ఆందోళనకర అంశంగానే నిలిచింది.
చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేసిందని విమర్శలు చేసిన జగన్.. తాను అధికారంలోకి వచ్చాక అంతకు మించిన స్పీడుతో అప్పులు తెస్తున్నారనే విషయం అంకెలతో సహా నిరూపితమైంది. ఎక్కడా ఆదాయం అనేది లేకపోవడంతో.. ఏరోజుకారోజు ఎక్కడి నుంచి నిధులు తేవాలా అని అధికారులు ఎక్స్ ర్ సైజ్ చేసి.. జగన్ ఆదేశించిన పథకానికి ఆ నిధులను మళ్లించడమే పనిగా పెట్టుకున్నారు. లేటెస్టుగా కరోనా కోసం కేంద్రం పంపిన నిధులు 600 కోట్లు.. మ్యాచింగ్ గ్రాంట్ 400 కోట్లు ఇవ్వకుండానే ఖర్చు పెట్టేశారు. రేపు మళ్లీ నిధులు తీసుకోవాలంటే మ్యాచింగ్ గ్రాంట్ చూపించిగాని తెచ్చుకోలేరు. అంత డబ్బు చూపించే అవకాశమే లేదు. రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ కింద కట్టాల్సిన అమౌంట్ కూడా టైమ్ కి కట్టలేకపోయారు. అనుకోకుండా నివర్ తుఫాన్ వచ్చి రైతులు పంట నష్టపోవడంతో.. దానిపై తెలుగుదేశం అసెంబ్లీలో నిలదీయడంతో.. రాత్రికి రాత్రి 590 కోట్లు రిలీజ్ చేశారు. అలా ప్రభుత్వ ప్రయారిటీ అంతా నవరత్నాల మీదే.. మళ్లీ ఎన్నికల్లో ఓట్లు తెచ్చిపెట్టే పథకాల మీదే. మిగతావి ఏమి ఏమైనా పర్వాలేదని జగన్ ఓపెన్ గానే చెబుతున్నట్లు అధికారులు కామెంట్ చేస్తున్నారు.
ఇప్పుడు సురేష్ ప్రభు లేఖను కేంద్రం సీరియస్ గా తీసుకుంటుందా.. లేక రాజకీయ అవసరాలతో దానిని నిర్లక్ష్యం చేస్తారా.. పక్కన పెట్టి.. తర్వాత టైమ్ వచ్చాక దానిని వాడతారా అనేది ఆసక్తికరంగా మారింది.