‘ఎంవీ గంగా విలాస్’నౌక బిహార్‌లో గంగానదిలో చిక్కుకు పోయిందన్న వార్తలపై అధికారులు స్పందించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని వారు వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ లగ్జరీ రివర్ క్రూయిజ్ నౌకను ప్రధాని మోడీ ఇటీవల ప్రారంభించారు.
ప్రారంభించిన రెండు రోజులకే ఈ నౌక బిహార్ విహార యాత్రకు వెళ్లింది. అయితే ఛాప్రా వద్ద గంగానదిలో నీటిలోతు తక్కువగా ఉండటంతో అక్కడ చిక్కుకు పోయిందని వార్తలు వచ్చాయి. దీంతో నౌకలోని ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారంటూ వార్తలు వచ్చాయి.
తాజాగా ఆ వార్తలను అధికారులు కొట్టి పడేశారు. రివర్ క్రూయిజ్ నౌక గంగానదిలో చిక్కుకు పోలేదన్నారు. ముందుగా అనుకున్న సమయానికే నౌక బిహార్ రాజధాని పాట్నాకు చేరుకుందన్నారు. యాత్ర యథావిధిగా సాగుతుందని వెల్లడించారు.
‘ఎంవీ గంగా విలాస్’ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. ఈ నౌక యూపీలోని వారణాసి నుంచి మొదలై బంగ్లాదేశ్ మీదుగా అసోంలోని దిబ్రూగర్‌కు 51 రోజుల్లో చేరుకోనుంది. ఈ నౌక మొత్తం 3,200 కిలోమీటర్లు ప్రయాణించనుంది. రెండు దేశాల్లోని మొత్తం 27 నదుల గుండా గంగా విలాస్ ప్రయాణం సాగుతుంది.
ఈ మార్గంలో 50 పర్యాటక క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ యాత్ర 51 రోజుల పాటు సాగుతుంది. ఈ యాత్ర కోసం ఒక్కొక్కరికి రూ. 55 లక్షల టికెట్ గా నిర్ణయించారు. అంటే రోజుకు సుమారు లక్ష రూపాయలు వరకు ఖర్చు అవుతున్నది.