విదేశీ ఆధారిత ‘ పంజాబ్ పాలిటిక్స్ టీవీ ‘కి చెందిన యాప్స్, వెబ్ సైట్స్, సోషల్ మీడియా అకౌంట్లను కేంద్రం బ్లాక్ చేసింది. ఖలీస్తాన్ అనుకూల ‘ సిక్ ఫర్ జస్టిస్ ” సంస్థతో దానికి సన్నిహిత సంబంధాలు ఉన్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్టు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ ఛానెల్ ఆన్ లైన్ మీడియాను ఉపయోగించుకుని దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తోందని చెప్పింది. డిజిటల్ మీడియాలోకి ఆ ఛానల్ వదులుతున్న కంటెంట్ దేశంలో మత ఘర్షణలు, వేర్పాటువాదాన్ని రెచ్చెగొట్టే విధంగా ఉన్నట్టు తెలిపింది.
ఆ ఛానల్ కంటెంట్ భారత సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో మరింత పట్టును పెంచుకునేందుకు ఆ ఛానల్ కొత్తగా యాప్ లు, సోషల్ మీడియా అకౌంట్లను ప్రారంభించినట్టు తెలిసిందని పేర్కొంది.
ద సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థను యూఏపీఏ చట్టం-1967 కింద కేంద్రం చట్ట బద్దం కాని సంస్థగా గతంలో ప్రకటించింది. వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గాను ఉపా చట్టం కింద వ్యక్తిగత తీవ్రవాదిగా ప్రకటించింది.