తమకు నచ్చనివారిపై రాజద్రోహం కేసులు పెట్టడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోతోంది. ఈ క్రమంలో దేశద్రోహ చట్టం పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశద్రోహ చట్టం(సెక్షన్ 124ఎ)లోని నిబంధనలను పున: పరీక్షించి, మరోసారి పరిశీలిస్తామని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని సమర్థించి, దానిని సవాలు చేస్తూ.. దాఖలైన పిటిషన్‌లను కొట్టివేయాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం ఇటీవల కోరింది. ఆ చట్టంలోని నిబంధనలను పున: పరిశీలించాలని నిర్ణయించుకున్నట్లు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. అయితే, దేశద్రోహ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తున్న పిటిషనర్ల విచారణను మే 10వ తేదీగా సుప్రీంకోర్టు ముందుగా నిర్ణయించింది.
అయితే, వలసకాలం నాటి దేశద్రోహం చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు సైతం గతేడాది జులైలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ వంటి జాతీయోద్యమ నేతల నోరుమూయించేందుకు నాటి బ్రిటిషర్లు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కేంద్రానికి నోటీసులు జారీచేసింది.
ఈ నేపథ్యంలో, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పాతకాలపు చట్టాలను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే దేశ ద్రోహ చట్టాన్ని కూడా రద్దు చేయాలని భావించారు. కానీ ఆ చట్టాన్ని మళ్లీ సమీక్షిస్తామని.. అందులోని లోపాలను సరిదిద్దనున్నట్లు తాజాగా ప్రవేశపెట్టిన అఫిడవిట్‌లో వెల్లడించింది. శనివారం సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ చట్టాన్ని సమర్థించింది కేంద్రం. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ 1962లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును గుర్తు చేసింది.