జమ్ము కశ్మీర్‌లోని ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్'(టీఆర్‌ఎఫ్)ను ఉగ్ర సంస్థగా కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఓ గెజిట్ విడుదల చేసింది. ఈ సంస్థ జమ్ముకశ్మీర్‌లో లష్కరే తోయిబాకు డమ్మీ సంస్థగా వ్యవహరిస్తోంది. దీనిపై చట్టవ్యతిరేక కార్యాకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)కింద చర్యలు మొదలు పెట్టింది.
టీఆర్ఎఫ్ సంస్థ లష్కరే తోయిబాకు పరోక్ష సంస్థగా పనిచేస్తోందని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ సంస్థ 2019 నుంచి కార్యకలాపాలు చేపట్టిందని వెల్లడించింది. టీఆర్‌ఎఫ్ ఓ నిషేధిత ఉగ్రవాద సంస్థ అని పేర్కొంది. ఈ సంస్థ ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్‌లైన్ ద్వారా భారీ ఎత్తున యువతను నియమించుకుంటోందని వివరించింది.
ఉగ్ర కార్యకలాపాలపై ప్రచారం చేస్తూ, నియామకాలకు సహకరిస్తూ, పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు, ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి వాటికి పాల్పడుతోందని తెలిపింది. భారత్ కు వ్యతిరేకంగా జమ్ము ప్రజలు ఉగ్రసంస్థల్లో చేరేలా ఈ సంస్థ ప్రోత్సహిస్తోందని చెప్పింది.
కశ్మీర్ లోయలో అమాయక ప్రజలు, భద్రతా దళా సిబ్బందిని హత్య చేసేందుకు పథక రచనకు సంబంధించి ఇప్పటికే ఈ సంస్థపై భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది. టీఆర్‌ఎఫ్ కమాండర్ షేక్ సాజిద్ గుల్‌ను యూఏపీఏ చట్టం కింద ఉగ్రవాదిగా ప్రకటించింది.