ప్రధాని మోడీ తన పుట్టిన రోజున నమీబియా నుంచి భారత్ కు తెప్పించిన ఛీతాల వల్లే పశువులకు లంపీ చర్మ వ్యాధి సోకిందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ ఆరోపించారు. ఇండియాలో పశువులకు ఈ వ్యాధి వ్యాపించిందంటే ఇందుకు కారణం ఛీతాలేనన్నారు. దీనివల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారని ఆయన చెప్పారు. నైజీరియాలో లంపీ వైరస్ చాలాకాలంగా ఉందని, అక్కడున్న ఛీతాలకు ఈ వైరస్ సోకిందని అన్నారు. అలాంటి వాటిని కేంద్ర ప్రభుత్వం కావాలనే ఇండియాకు తెప్పించిందని ఆయన సోమవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
ముంబై శివార్లలోని ఖార్ ప్రాంతంలో కొన్ని పశువుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనబడుతున్నాయని సమాచారం అందడంతో పటోల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఆవులు, గేదెలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని, బీర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఇదివరకే తెలిపింది. వీటిలో 2 వేలకు పైగా ఆవులకు ఈ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ ఇప్పించినట్టు అధికారులు తెలిపారు.
పైగా గత నెల 9 నుంచే కబేళాలకు పశువుల తరలింపును అధికారులు నిషేధించారు. దేశంలో గుజరాత్, రాజస్థాన్, హర్యానా సహా సుమారు 15 రాష్ట్రాల్లోలంపీ వ్యాధి కారణంగా వేలాది పశువులు మరణించాయి.
తెలంగాణలోని 12 జిల్లాలోని పశువుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించడంతోబయటి రాష్ట్రాల నుంచి వీటి రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం బోర్డర్స్ ని మూసివేసింది. అయినా సరైన తనిఖీలు లేని కారణంగా ఈ చర్య ఆశించిన ఫలితాలనివ్వడం లేదు. ఇటీవల ఒడిశా నుంచి అక్రమంగా లారీలో తెలంగాణకు ఆవులను తరలిస్తుండగా మధ్యలో వాహనం బోల్తా పడి 20కి పైగా ఆవులు మరణించాయి.