అరుణాచల్ ప్రదేశ్ లోని మూడు జిల్లాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ ఎస్పీఏ)ను ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉత్తర్వులు అరుణాచల్ ప్రదేశ్ లోని చాంగ్ లాంగ్, లాంగ్ డింగ్, టిరాప్ జిల్లాల్లో నేటి నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. ఇవి సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్ లోని నామ్ సాయ్, మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లోనూ ఈ చట్టం అమలులోకి వస్తుందని కేంద్రం పేర్కొంది.
‘ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం-1958లోని సెక్షన్ 3 ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగిస్తూ అరుణాచల్ ప్రదేశ్ లోని టిరాప్, చాంగ్ లాంగ్, లాంగ్ డింగ్ జిల్లాలతో పాటు నామ్ సాయ్, మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటిస్తున్నాము’ అని ప్రకటనలో తెలిపింది.