కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్ల రైతులు చేస్తున్న ఆందోళనలు 36వ రోజుకు చేరుకున్నాయి. కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు.. కొన్ని సవరణలు చేసేందుకు మాత్రమే కేంద్రం పట్టుదలగా ఉండటంతో.. ప్రతిసారి చర్చలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. ఈ క్రమంలో నేడు రైతులు మరోసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నారు.
వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత.. ఈ రెండు అంశాలు కచ్చితంగా చర్చల ఎజెండాలో ఉండాల్సిందేనని ఇప్పటికే రైతు సంఘాలు కేంద్రానికి తేల్చిచెప్పాయి. ఈ విషయంపై ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాయి. అలాగే 2020 విద్యుత్ సవరణ ముసాయిదా బిల్లులో మార్పులపై కూడా చర్చించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు రైతులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా.. వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ ఆర్డినెన్స్‌లో సవరణ చేసే అంశాన్ని కూడా తాజా ఎజెండా చేర్చాలని కోరాయి.
ఇదిలా ఉంటే.. ఈసారి చర్చల్లో ఎలాగైనా సమస్యను కొలిక్కి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఈమేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో మంత్రుల బృందం.. రైతులతో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేసింది. ఆందోళనలు ఇంకా కొనసాగితే మంచిది కాదని, చట్టాల అమలుకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని భావిస్తున్న కేంద్రం.. కచ్చితంగా ఓ పరిష్కారాన్ని చూపాలన్న నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.