– ఈసారి అల్ జజీరా సంచలనం
– బొగ్గు గనుల వేలంలో అవకతవకలు
– ప్రభుత్వాన్ని హెచ్చరించిన కాగ్
– అయినా పట్టించుకోని మోడీ సర్కార్
– ఆనాటి నివేదికపై అల్ జజీరా సంచలనం
అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదక దేశంలో ప్రకంపనలు రేపుతోంది. ఓవైపు అదానీ సంపద ఆవిరవుతుంటే.. ఇంకోవైపు మోడీ సర్కార్ ను ప్రతిపక్షాలు కార్నర్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అల్ జజీరా సంచలన నివేదికను బయటపెట్టింది. పశ్చిమ బెంగాల్ బొగ్గు గనుల లీజ్ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది.
దేశంలో బొగ్గు గనుల లీజును దక్కించుకునేందుకు షెల్ కంపెనీలను పోటీలోకి తెచ్చి కొన్ని సంస్థలు కుట్రలు పన్నుతున్నాయని, దాంతో ఖజాను గండి పడే అవకాశం ఉందని కాగ్ ముందే హెచ్చరించిందని పేర్కొంది. కానీ, మోడీ సర్కార్ దాన్ని పట్టించుకోలేదని అల్ జజీరా అంటోంది. ఆ నివేదిక ప్రకారం… బెంగాల్ లో బొగ్గు గనుల వేలం ప్రక్రియలో ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపు అవతవకలకు పాల్పడేందుకు సహకరించేలా మోడీ సర్కార్ వ్యవహరించినట్టు నివేదిక సారాంశంగా ఉంది. బిడ్ ప్రోటోకాల్స్ ను ఉల్లంఘించి, షెల్ కంపెనీలను ఉపయోగించి వేలంలో పోటీని సదరు కంపెనీలు తగ్గించాయని పేర్కొంది. తద్వారా బిడ్డింగ్ లో లీజును దక్కించుకున్నాయని వెల్లడించింది.
బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు 2014లో 204 కంపెనీలకు కేటాయించిన లీజులను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. దేశం ఆస్తులను చౌకగా విక్రయించారంటూ బీజేపీ ఆరోపణలు చేసింది. తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, మరోసారి వేలాన్ని నిర్వహిస్తుందని పేర్కొంది. ఆ తర్వాత వేలాన్ని నిర్వహించగా.. బెంగాల్ లోని సరిసటోల్లి బొగ్గు గని వేలం కోసం మోడీ ప్రభుత్వం ఐదు కంపెనీలను ఎంపిక చేసింది. వాటిలో మూడు ఆర్పీ సంజీవ్ గోయెంకా(ఆర్పీ-ఎస్జీ)కి చెందినవని కాగ్ వెల్లడించింది.
బొగ్గు వేలానికి ముందు గోయెంకా కంపెనీ మూడు షెల్ సంస్థలను కొనుగోలు చేసిందని రికార్డులు సూచిస్తున్నాయి. ఆ సంస్థ నుంచి పాల్గొన్న మూడు కంపెనీల్లో ఆర్పీ-ఎస్జీ అనుబంధ సంస్థల్లో ఒకటి వేలం బిడ్ వేయలేదు. మరొక అనుబంధ సంస్థ, షెల్ కంపెనీ దాని మాతృ సంస్థ కలకత్తా ఎలక్ట్రిసిటీ సప్లై కార్పొరేషన్(బిడ్ పొందిన సంస్థ) ఉపయోగించిన అదే ప్రైవేట్ ఐపీ చిరునామా నుండి బిడ్ చేసింది.
2016 ఆగస్టులో కాగ్ అధికారులు పార్లమెంటుకు సమర్పించిన తుది నివేదికలో… ప్రభుత్వ వేలం, 10 ఇతర గనులకు సంబంధించి హెచ్చరికలు చేశారు. వేలం సమయంలో సమర్థవంతమైన స్థాయిలో పోటీ జరగలేదని కాగ్ చెప్పింది. ఈ వేలం జరిగిన కొన్ని నెలల తర్వాత, మోడీ ప్రభుత్వం వేలం ప్రక్రియ దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉందని అంతర్గతంగా అంగీకరించింది. వేలంపాటలో అవలంభిస్తున్న నియమాలు బిడ్డర్ లు కుమ్మక్కయ్యేందుకు, పోటీని తగ్గించేందుకు సహాయం చేసేలా ఉన్నాయని ఒప్పుకుంది. అయితే.. బొగ్గు గనులను వేలం వేసిన తర్వాత ప్రభుత్వం నిబంధనలను సవరించింది. గనుల లీజు దక్కించుకున్న ఆర్పీ-ఎస్జీ సంస్థ సీఈఏసీతో పాటు చాలామంది బిడ్డర్లు గనులను ఇప్పటికీ నిర్వహిస్తున్నారు.
బిడ్డర్ల కుమ్మక్కు, వాటి షెల్ కంపెనీలతో వేలంలో పోటీ చేయడం వంటి అనుమానాలపై 11 కంపెనీల పేర్లను కాగ్ తన తుది నివేదికలో చేర్చింది. సరిసటోల్లి గనుల విషయంలో ఒకే ఐపీ చిరునామా నుండి ఆర్పీ-ఎస్జీ గ్రూప్ కంపెనీలు వేలంలో బిడ్ వేసినట్లు కాగ్ ఆధారాలు సేకరించింది. అయితే, తుది నివేదికలో గని పేరు, బిడ్డర్ల గుర్తింపులను బహిర్గతం చేయలేదని తాజాగా అల్ జజీరా అంటోంది.