జమ్మూ కశ్మీర్లోని యూరి సెక్టార్, పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడులు కేంద్ర ప్రభుత్వం ‘సృష్టించినవే’ నని షాకింగ్ కామెంట్ చేశారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత షేక్ ముస్తఫా కమల్. 2016 లో యూరి లోను, 2019 లో పుల్వామా జిల్లాలోను జరిగిన ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఫోటోలు గానీ, వారి మృతదేహాలు గానీ ఎక్కడా కనిపించలేదని ఆయన చెప్పారు. అసలు మరణించినవారంతా ఎస్సీలని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన దుయ్యబడుతూ.. ఈ దాడుల్లో ఎవరిది తప్పో చేతిలోని 5 వేళ్ళూ కేంద్రప్రభుత్వం వైపు చూపుతున్నాయన్నారు. ఇదంతా కేంద్రం ప్లాన్ చేసిందే.. మృతుల డెడ్ బాడీల ఫోటోలు లేదా వాటిని మేం చూడలేదు. అని సోమవారం మీడియా తో అన్నారు. పొరుగు దేశాల సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందంటే అందుకు ఈ ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలే అని ఆరోపించారు.
యూరి, పుల్వామా దాడులపై విచారణకు ఓ నిజ నిర్ధారణ కమిషన్ ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది స్పష్టమయ్యేంత వరకు వీటికి కేంద్రానిదే బాధ్యత అని భావించవలసివస్తుందన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు గానీ, డిక్లరేషన్లు గానీ ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వలేదని షేక్ ముస్తఫా కమల్ విమర్శించారు.
ఈ సందర్భంగా సిమ్లా ఒప్పందం, తాష్కెంట్ అగ్రిమెంట్, లాహోర్ డిక్లరేషన్ వంటివాటిని ఆయన గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు ఈయన సోదరుడు.