కేంద్రం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది భారత్‌లో జీ20 సదస్సు జరగనుంది. కనుక సమ్మిట్‌కు సంబంధించిన సలహాలు, చర్చలు, వ్యూహాలను ఖరారు చేసేందుకు కేంద్రం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ డిసెంబర్ 1న జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది.
జీ20 ప్రెసిడెన్సీ సమయంలో భారత్.. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో 32 వేర్వేరు రంగాలలో 300 సమావేశాలను నిర్వహిస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయం ప్రకారం, వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరగనున్న G-20 సమ్మిట్ భారతదేశం నిర్వహించే అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సమావేశాలలో ఒకటి.
ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే ఈ సమావేశానికి దాదాపు 40 పార్టీల అధ్యక్షులను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. దీనికి సభ్యదేశాల దేశాధినేతలు లేదా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సదస్సు నిర్వహణపై దేశంలోని పలు ప్రాంతాల్లో కేంద్రం సమావేశాలు ఏర్పాటు చేయనుంది.