కరోనా మహమ్మారి మరోసారి కట్టలు తెంచుకుంటోంది. దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో విజృంభించిన కరోనా.. ఫోర్త్ వేవ్ కు సిద్ధం అయినట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
అయితే.. కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కోవిడ్ కేసులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు దేశంలోని అయిదు రాష్ట్రాలకు కేంద్ర లేఖ రాసింది.
కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ.. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.. తమిళనాడు, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు లేఖ రాశారు. కేసులు పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
కఠినమైన నిబంధనలతో పాటు.. ప్రతీ క్షణం నిఘా ఉంచాలని లేఖలో పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పారు. గతంలో కోవిడ్ సమయంలో చేసిన తప్పును మరోసారి చేయొద్దన్నారు రాజేష్.