ముంబైలోని వోర్లి మిల్క్ డైరీ ప్రాంతంలో ఆదివారం ఉదయం వేగంగా వచ్చిన కారు ఢీకొని మహిళా సీఈఓ దుర్మరణం చెందారు. ఆల్ ట్రస్ట్ టెక్నాలజీస్ సీఈఓ అయిన 42 ఏళ్ళ రాజలక్ష్మి విజయ్ .. ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో జాగింగ్ చేస్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఈ వాహనం ఆమెను ఢీకొంది. ఈ ఘటనలో ఆమె గాల్లోకి కొన్ని అడుగుల ఎత్తున ఎగిరి కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు.
ఆమెను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. తన భార్యతో బాటు ఆమె భర్త కూడా ఆ సమయంలో కొద్దిదూరంలో జాగింగ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ కి స్పల్ప గాయాలయ్యాయన్నారు. మద్యం మత్తులో వాహనం నడిపిన 23 ఏళ్ళ యువకుడిని అరెస్టు చేసి అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రాజలక్ష్మి విజయ్.. ఫిట్ నెస్ స్పెషలిస్ట్ అని, నగరంలో జాగింగ్ ఫోరమ్ సంస్థలో సభ్యురాలని తెలిసింది. ఇటీవలే ఆమె టాటా ముంబై మారథాన్-2023 లో కూడా పాల్గొన్నారని ఆమె సన్నిహితులు తెలిపారు. ఈ ఘటనలో రాజాలక్ష్మి దుర్మరణం చెందడం తనను కలచివేసిందని, లండన్ మారథాన్ ఈవెంట్ లో పాల్గొనడానికి కూడా సిద్దపడుతున్న తరుణంలో ఇలా జరగడం దారుణమని ఆమె సన్నిహితుల్లో ఒకరు వాపోయారు.
కేవలం నెలరోజుల క్రితమే రాజలక్ష్మి తన మారథాన్ ట్రియంఫ్ గురించి ‘లింక్డ్ ఇన్’ లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఆ ఈవెంట్ లో తాను పాల్గొనడం అద్భుతమైన అనుభవంగా పేర్కొన్నారు. జాగింగ్ వంటివాటివల్ల మానసిక, శారీరక దృఢత్వం అలవడుతుందని తెలిపారు.