చిన్న పామునైనా పెద్ద కర్రతొ కొట్టాలి’ అంటారు. అలాగే, చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే నేరస్థుడిని పట్టుకునేందుకు కూడా పోలీసులు పెద్ద ప్లానే వేశారు. అంతా చూస్తుంటే సినిమాలో సీన్‌లా అనిపించిన నిజంగానే జరిగింది. అది కూడా ఎక్కడో కాదండి మన హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. ఇంతకి ఆ దొంగ ఏం చేశాడు.. పోలీసులకు ఎలా చిక్కాడంటే..?
ఉత్తప్రదేశ్‌కు చెందిన హేమంత్ అనే వ్యక్తి ఢిల్లీలో నివసిస్తుంటాడు. జల్సాలకు అలవాటు పడి గొలుసు దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే మంగళవారం అబ్ధుల్లాపూర్‌మెట్‌లోని పీఎస్ పరిధిలో కమల అనే మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కొని పరారయ్యాడు. ఈ క్రమంలో కమల కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడి వరకు మాములుగా ఉంది. కానీ గొలుసు లాక్కెళ్లిన హేమంత్‌ను పట్టుకునేందుకు పోలీసులు చాలానే కష్టపడ్డారు.
గొలుసు దొంగను పట్టుకునేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం టెక్నాలజీ సాయంతో నిందితుడు శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి ఢిల్లీ పారిపోతున్నట్లు తెలియడంతో వెంటనే ఎయిర్ పోర్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బుధవారం ఉదయం 5 గంటలకు సమాచారం అందుకున్న ఔట్‌పోస్ట్ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయ భద్రతా సిబ్బందితో కలిసి అంతా గాలించారు.
చివరికి, నిందితుడు హేమంత్ ఢిల్లీ వెళ్లే జెట్‌ఎయిర్‌వేస్ విమానంలో ఉన్నట్టు గుర్తించారు. రన్‌వేపై ఉన్న విమానం దగ్గరికి వెళ్లి నిందితున్ని అదుపులోకి తీసుకుని రాచకొండ పోలీసులకు అప్పజెప్పారు. అతడి దగ్గర ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. హేమంత్పై ఇప్పటివరకు మొత్తం ఆరు కేసులున్నాయి.
మరో ఆశ్చర్యకరమైన అంశమేంటంటే.. గొలుసు దొంగతనాలు చేసేందుకు హేమంత్ విమానాల్లోనే రాకపోకలు కొనసాగిస్తుంటాడట. కేవలం మెట్రోనగరాల్లోనే దొంగతనాలు చేస్తుంటాడట. ఈ విలాసవంతమైన గొలుసుదొంగను పట్టుకోవడంలో సఫలీకృతమైన కానిస్టేబుళ్లు.. శ్రీశైలం, భాను, లింగంను శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి అభినందించారు.