శాసన మండలిలో.. 24 గంటలు కరెంట్ ఇష్యూ హీట్ పుట్టించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ భానుప్రసాద్ అడ్డుపడ్డారు.
దీంతో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మంత్రి కాదు అలాంటప్పుడు జీవన్ రెడ్డి మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగించిన జీవన్ రెడ్డి వాస్తవాలకు భిన్నంగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు.
క్షేత్రస్థాయిలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. దీనిపై ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావుతో మాట్లాడానని జీవన్ రెడ్డి అనగా..సభలో లేని వ్యక్తుల పేర్లు తీయొద్దని ఛైర్మన్ సూచించారు. ఆ పదాలను శాసన మండలి రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కరెంట్ ఇబ్బందులు ఉన్నాయో ఆ వివరాలను మంత్రికి తెలియజేస్తే ఆయన సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. రైతులకు ఎంత కరెంట్ కావాలో అంత ఇస్తున్నారని ఛైర్మన్ స్పష్టం చేశారు.