– సూత్రధారి లింగమనేనిపై బీఎస్ రావు ఫైర్
– ఇప్పటికీ అదే నయవంచన
– చైతన్య సంస్థకు మెడికల్ కాలేజీ ఆశ చూపి చీటింగ్
– తీరా మేఘా కంపెనీ ముందు మోకరిల్లిన లింగమనేని!
– పదేండ్ల క్రితమే రూ.310 కోట్లు తీసుకున్నారని ఆధారాలు
– సుప్రీం ఆదేశించినా ఫలితం లేదంటూ ఆవేదన
క్రైంబ్యూరో, తొలివెలుగు:
గుంటూరు చిన్నకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ వ్యవహారం గుట్టు రట్టవుతోంది. గతంలో ఎన్ఆర్ఐ మేఘా కబ్జా శీర్షికన తొలివెలుగు అనేక కథనాలు ప్రచురించింది. శ్రీ చైతన్య యాజమాన్యానికి మెడికల్ కాలేజీ ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుని మేఘా కంపెనీకి చెందిన బినామీ డైరెక్టర్స్ కు ఇచ్చారని అప్పట్లో వరుస కథనాలు ఇచ్చాం. కేసులు నమోదైనప్పటికీ అధికారుల అండదండలతో వారు తప్పించుకు తిరుగుతున్నారు.
నిజం నిప్పులాంటిది. దాన్ని ఎంతో కాలం దాచలేరు. తాజాగా శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం బీఎస్ రావు కుండ బద్దలు కొట్టేశారు. తాను మోసపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కాలేజీలను విస్తరించేందుకు భూములు, భవనాలు కొనుగోలు చేసి ఇస్తామని చెప్పి 2012-13లో రూ.310 కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఒప్పందాల ప్రకారం అటు కాలేజీలను అప్పగించకుండా ఇటు డబ్బులు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు.
ఏపీలోని ప్రధాన పార్టీల నాయకుల వద్ద సెటిల్మెంట్ చేసుకుందామని నమ్మించి 2016లో ఓ ఒప్పంద పత్రాన్ని రాయించి ఇచ్చారన్నారు. ఆ తర్వాత ఒప్పందాన్ని పాటించకుండా మరోసారి వంచించారని వాపోయారు. 2019లో చెక్కులు తీసుకుని నగదు ఇస్తామని చెప్పారన్నారు. కానీ, అప్పుడు కూడా మాటపై నిలబడలేదని చెప్పారు. చెక్కులు బ్యాంకులో వేస్తే బౌన్స్ అయ్యాయి.. దీంతో హైదరాబాద్ సీసీఎస్ లో ఫిర్యాదు చేశానని.. రూ.300 కోట్ల వ్యవహారంపై 6 ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేశారని వివరించారు.
ఆస్తులు తనవి కాకపోయినా అమ్మకం!
ఆస్తి తనది కాదు.. కనీసం సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకోరు.. కానీ, మీకు విక్రయించే బాధ్యత తనది అంటూ అగ్రిమెంట్లు కుదుర్చుకుని డబ్బులు లాగేయడంలో లింగమనేని రమేష్ దిట్ట అని అంతా చర్చించుకుంటున్నారు. ఇలానే తమ కుటుంబాన్ని మోసం చేశారని బీఎస్ రావు అంటున్నారు. ఏండ్లు గడిచినా డబ్బులు తిరిగి ఇవ్వరు, ఆస్తి అసలే ఇప్పించరని బాధితులు కూడా వివరిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఉలుకు, పలుకు ఉండదని చెబుతున్నారు.
సివిల్ మ్యాటర్ అని పోలీసులపై ఒత్తిళ్లు తెప్పించి తప్పించుకుంటారని.. ఇదే విషయంలో తెలంగాణ డీజీపీ నుంచి ఫోన్ చేయించుకుని అరెస్ట్ లు కాకుండా అడ్డుకున్నారని బాధితులు అంటున్నారు. ఏండ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగకపోవడంతో శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం మీడియా ముఖంగా తీవ్ర విమర్శలు చేసింది. లింగమనేని మోసాలపై సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీంతో తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ, సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేశారంటేనే ఎంత బరి తెగించారో మనం అర్థం చేసుకోవచ్చు. అమరావతి భూముల్లో అడ్వాన్సులు ఇచ్చినా ఏ ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడంతో డబ్బులన్నీ అక్కడే ఆగిపోయాయని తెలుస్తోంది.