ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. దళితబంధు పంపిణీలో అర్హులకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ.. గీసుగొండ మండల పరిదిలోని శాయంపేట గ్రామంలో ఆందోళనకు దిగారు. ఎవరికి సమాచారం ఇవ్వకుండా కేవలం టీఆర్ఎస్ పార్టీకి చెందిన పది కుటుంబాలకు మాత్రమే కేటాయించారని ఆరోపించారు.
ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ తీసుకున్నవారినే దళితబంధు పథకానికి అర్హులుగా ఎంపిక చేశారని మండిపడ్డారు. దీంతో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిసి.. గ్రామంలోని దళితులందరికి దళితబంధు ఇవ్వాలని కోరామని.. అందుకు స్పందించిన ఎమ్మెల్యే.. టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తామని బదులిచ్చారని ఆరోపించారు.
నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటూ ధర్మారెడ్డి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామని విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ధర్మారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. దళితులందరికి సమాన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Advertisements
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. పార్టీ కార్యకర్తలకు కాకుండా.. దళితులందరికి దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే దళితులంతా ఏకమై ధర్మారెడ్డిని గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.