సాగు చట్టాలు, పెట్రో ధరలు పెంపును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైన ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొన్నారు. హైదరాబాద్ లుంబినీ పార్క్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే సెక్రటేరియట్ వద్దే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను నిలువరించి… అదుపులోకి తీసుకున్నారు.
టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, మధు యాష్కీ, చిన్నా రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, పార్టీ సీనియర్లు వీహెచ్, పొన్నాల, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, యూత్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, ఓబీసీ సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ నాయకులు బెల్లయ్య నాయక్‌తో పాటు వందలాది మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు అరెస్ట్ చేయడంతో కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.