ఉత్తరాఖండ్‌లోని చమోలీలో జల విపత్తులో చిక్కుకుపోయిన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పదిహేను రోజులు గడిచిపోవడంతో.. జాడ లేకుండా పోయిన బాధితులు ఇక చనిపోయినట్టేనని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గల్లంతైన వారిని మరణించినట్టుగా అధికారిక ప్రకటన చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది.
ఫిబ్రవరి 7న ధౌలి గంగాలో మంచుకొండలో కొంత భాగం విరిగిపడింది. దీంతో ఒక్కసారిగా నది ప్రవాహం ఎక్కువైంది. ఈ ఘటనలో తీవ్ర విధ్వంసం జరిగింది. విద్యుత్ కేంద్రాలు, వంతెనాలు నీటిలో కొట్టుకుపోయాయి. మరోవైపు ఈ ప్రవాహంలో 204 మంది గల్లంతయ్యారు. వీరిలో ఇప్పటివరకు 68 మంది మృతదేహాలు దొరికాయి. ఇంకా 136 మంది జాడ తెలియడం లేదు. దీంతో వారు చనిపోయినట్టుగా అధికారులు భావిస్తున్నారు.