వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ కేసులో ఈ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్ఛర్ లను జుడిషియల్ కస్టడీ నుంచి విడుదల చేయాలని బాంబేహైకోర్టు ఆదేశించింది. సిబిఐ వీరిని అరెస్టు చేయడం చట్ట నిబంధనల ప్రకారం లేదని కోర్టు పేర్కొంది. లక్ష రూపాయల పూచీకత్తు చొప్పున వీరు విడుదలయ్యారు. అయితే తమ పాస్ పోర్టులను సీబీఐకి అప్పగించాలని కోర్టు సూచించింది.
సిబిఐ తమను అక్రమంగా అరెస్ట్ చేసిందని, అందువల్ల రిలీజ్ చేయాలని ఈ దంపతులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు.. ఈ నెల 6 న తన ఉత్తర్వులను రిజర్వ్ లో ఉంచింది. ఈ కేసులో వీరిని డిసెంబరు 25 న అరెస్టు చేశారు. తమ కుమారుడి పెళ్లి ఈ నెల 15 న జరగాల్సి ఉందని, అందువల్ల తమను విడుదల చేయాలని కూడా వీరు అభ్యర్థించారు.
‘సిబిఐ మమ్మల్ని అరెస్టు చేయడం నిరంకుశపూరితంగా ఉంది.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని 46 (4) సెక్షన్ ప్రకారం మా అరెస్టు జరగలేదు.. పైగా నన్ను అరెస్టు చేస్తున్నప్పుడు మహిళా పోలీసు అధికారి కూడా లేరు’ అని చందా కొచ్చర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను సిబిఐ తోసిపుచ్చింది.
చట్ట ఉల్లంఘన ఏదీ జరగలేదని, అరెస్ట్ సమయంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారమే వీరిని అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేసింది. వీరి విడుదలకు సంబంధించి బాంబేహైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీబీఐ.. సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రూ. 3,250 కోట్ల వీడియోకాన్ ఫ్రాడ్ లోన్ కేసులో వీరిని ఈ సంస్థ అరెస్టు చేసింది. ఈ కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ దూత్ ని కూడా అరెస్టు చేశారు.