చండీగఢ్ లో వీధికుక్కకు ఆహారం తినిపిస్తున్న పాతికేళ్ల యువతిపై నుంచి వేగంగా కారును పోనిచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని సందీప్ సాహి అనే రిటైర్డ్ ఆర్మీ మేజర్ గా గుర్తించారు. ఇతనికి రాజస్థాన్ లో సెక్యూరిటీ ఏజెన్సీ ఉందని పోలీసులు తెలిపారు. టీ తాగేందుకు కారులో వెళ్తూ ఆయన… తేజస్విత అనే ఈ యువతిని కారుతో ఢీ కొట్టి వెళ్లిపోయాడన్నారు. తన కారు ఏ వస్తువునో తాకినట్టు గమనించానని, అందుకే తన వాహనం దెబ్బ తిన్నదేమోనని ఒక్క క్షణం ఆపానని ఆయన చెప్పాడు.
అయితే ఈ యాక్సిడెంట్ ను ఆయన చూడలేదట.. ఈ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తేజస్విత తల్లి మంజీన్దర్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ … ఇతనిపై తాము అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. తన కూతురు శునకానికి ఆహారం వేస్తుండడాన్ని తాను కొద్ది దూరంనుంచే చూస్తున్నానని, ఒక్కసారిగా వేగంగా వచ్చిన కారు ఆమెపై నుంచి దూసుకుపోయిందని ఆమె చెప్పారు.
కారులోని వ్యక్తి మద్యం తాగి ఉన్నట్టు కనిపించిందన్నారు. ఆ కారు మరో కారును ఢీ కొట్టకపోయి ఉంటే తన కూతురికి ప్రాణాంతకమైన తీవ్ర గాయాలై ఉండేవన్నారు. ఈ యాక్సిడెంట్ సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఇందులోని ఫుటేజీని చూసిన పోలీసులు.. దీనికి కారణమైన సందీప్ సాహిని అదుపులోకి తీసుకున్నారు.
ఆర్కిటెక్ట్ అయిన తేజస్విత కౌశల్ ..యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. చండీగఢ్ లోని ఫర్నిచర్ మార్కెట్ వద్ద ఈమె తలిదండ్రులు ప్రతివారం వీధికుక్కలకు ఆహారం వేస్తుంటారట.. ఇలా తాము ఆరేళ్లుగా వాటికి ఆహారం వేస్తున్నట్టు తేజస్విత తల్లి తెలిపారు.