తుగ్లక్ పాలన కొనసాగిస్తున్న సీఎం జగన్ నల్ల జీవోలతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జీవో 1కు చట్టబద్ధత లేదని ఆయన పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్తుండగా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు
దీంతో ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సైకో పోవాలి, సైకిల్ రావాలని అన్నారు. తన నియోజవర్గంలో తనను తిరగనివ్వకుండా అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చారంటూ పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. దీంతో రోడ్ షోకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు.
దీంతో వెంటనే ఆయన తన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. సీఎం జగన్‌పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సైకో ముఖ్యమంత్రికి బానిసలుగా బతకకండి అంటూ పోలీసులకు సూచించారు. తమ రోడ్ షోలను అడ్డుకుంటున్న సీఎంకు రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించడానికి సిగ్గులేదా? అని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పలు ప్రాంతాల్లో నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు రోడ్ షోలు నిర్వహించారని ఆయన తెలిపారు. అధికార పార్టీ నేతలకు ఒక రూలు, తమకు ఒక రూలా? అని ఆయన పోలీసులను ప్రశ్నించారు. తనను పంపించేవేయాలని అనుకుంటే తానే పోలీసులను పంపించేస్తానని హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను మళ్లీ గాడిలో పెడతానని పేర్కొన్నారు. పోలీసులు బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజలకు మేలు చేయాలని ఆయన సూచించారు.