కాకినాడ జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలోని జీ రాగంపేటలో అంబటి ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందిన వార్త కలచివేసిందన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృత్యువాత పడ్డ కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
ఈ ప్రమాదంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చెల్లించిన విధంగా పరిహారం ఇవ్వడంతో పాటు, తగిన ఉపాధి అవకాశాలు చూపించేలా ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో తరచుగా ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నా గానీ ప్రభుత్వం తగిన సమీక్షలు చేపట్టడం లేదని విమర్శించారు పవన్ కళ్యాణ్.
కాగా పెద్దాపురం నియోజకవర్గంలోని జీ రాగంపేటలో అంబటి ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురు కార్మికుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ డా. కృతిగా శుక్లా తెలిపారు.
గురువారం ఉదయం పెద్దాపురం మండలం జి.రాగంపేట అంబటి ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ఆయిల్ ట్యాంకర్ ను శుభ్రపర్చేందుకు ట్యాంకర్ లోకి దిగిన క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారంతా ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఐదుగురు పాడేరుకు చెందినవారు కాగా, మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరకు చెందిన వారిగా గుర్తించారు. వెచంగి కృష్ణ (35), వెచంగి నరసింహ (38), వెచంగి సాగర్ (20), కురవడు బంజుబాబు, కుర్రా రామారావు, కట్టమూరి జగదీష్ (25), యల్లమిల్లి దుర్గాప్రసాద్ లు గా గుర్తించారు.