– ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ వెనుక వైసీపీ!
– జనసేన, టీడీపీని దెబ్బతీసే వ్యూహం
– ముందే గ్రహించిన పవన్, బాబు
– దీటుగా బదులిచ్చే ప్రయత్నాలు
– ఇద్దరు సీఎంలకు షాకిచ్చేలా ప్రణాళికలు
ఏపీలో కాపు ఓటర్లపైనే బీఆర్ఎస్ ప్రధానంగా ఫోకస్ పెట్టిందనే చర్చ ఉంది. దీని వెనుక జనసేన, టీడీపీని దెబ్బతీసే వ్యూహం ఉందనే వాదన రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పైగా జనసేనకు చెందిన నేత తోట చంద్రశేఖర్ కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం వెనుక కూడా ప్లాన్ అదేనని అంటున్నారు. అయితే.. ఈ వ్యూహాన్ని ముందే పసిగట్టిన చంద్రబాబు, పవన్ పొత్తు దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు రాజకీయ పండితులు.
టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీకి పెద్ద నష్టం తప్పదు. అందుకే మిత్రుడు కేసీఆర్ తో కలిసి జగన్.. ఆ రెండుపార్టీల ఓటుబ్యాంకుపై ప్రత్యేకంగా దృష్టి సారించి చీలిక తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు. దీనివల్ల వైసీపీకి పరోక్షంగా లాభం జరుగుతుందని.. అలాగే బీఆర్ఎస్ కు ప్రత్యక్షంగా ఓటు శాతం పెరుగుతుందని కేసీఆర్, జగన్ భావించి ప్లాన్ ను అమలు పరుస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు.
జగన్, కేసీఆర్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు దిగిపోయాక.. వీళ్లిద్దరూ విందులు, టూర్లు అంటూ తెగ హడావుడి చేశారు. కొన్ని కొన్ని విషయాల్లో వివాదాలు ఉన్నట్లు కలరింగ్ ఇచ్చినా.. స్నేహం కొనసాగిస్తూనే ఉన్నారని చెబుతున్నారు విశ్లేషకులు. మొదటి నుంచి ఇద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారని.. అలా వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారట. గత ఎన్నికల్లో చేసినట్లుగా ఈసారి కూడా సాయం చేయడానికి కేసీఆర్ సిద్ధమై.. కాపు ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా జనసేన, టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు.
మరోవైపు కేసీఆర్, జగన్ వ్యూహాన్ని పసిగట్టిన పవన్, బాబు పొత్తు వ్యూహాల్లో ఉన్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు. అందులోభాగంగానే తాజాగా హైదరాబాద్ లో కీలక భేటీ జరిగిందని అంటున్నారు.