2023 పెను మార్పులకు వేదిక కానుందన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. వైసీపీలో విభేదాలు మొదలయ్యాయని.. ఎప్పుడేం జరుగుతుందో తెలియదని చెప్పారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా శనివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం కోలుకోలేని పరిస్థితికి వచ్చిందని విమర్శలు గుప్పించారు. 5 కోట్ల జనం ఒక పక్కన.. జగన్ మరో వైపున యుద్ధం మొదలైందని అన్నారు.
సీఎం జగన్ నిజంగా సైకో అని.. అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసేశారని విమర్శించారు చంద్రబాబు. రాష్ట్రంపై గౌరవం ఉండేవారు ఆ పార్టీలో ఉండరన్నారు. స్థానిక సంస్థల వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు ఆ పార్టీలో ఎందుకు ఉండాలన్నారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుందని విమర్శలు చేశారు. వైసీపీలో రానురాను తిరుగుబాటు ఇంకా పెరుగుతుందని, పోరాటం చేయకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని చెప్పారు.
ప్రజలంతా వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్నామని, వైసీపీ ప్రభుత్వంలో బాదుడు, విధ్వంసాలు, వేధింపులుగా ఈ ఏడాది మిగిలిపోయిందని అన్నారు. ప్రశ్నిస్తే మానసిక క్షోభ, శారీరక వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పోలీసులతో కేసులు పెట్టించి ఇబ్బంది పెడుతున్నారని ఫైరయ్యారు. మనమంతా బాధ పడుతుంటే జగన్, అతని పక్కన ఉండే వారు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు.
కందుకూరు ఘటనలో తనపై కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేశారన్నారు చంద్రబాబు. బాబాయి వైఎస్ వివేకను చంపినోడిపై చర్యలు లేవని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు, మీడియా, న్యాయ వ్యవస్థలపై దాడి చేస్తున్నారని ఫైరయ్యారు చంద్రబాబు.