ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. జగన్ పిచ్చి తుగ్గక్ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం గణనీయంగా తగ్గిందని, జగన్‌కు మాత్రం జేట్యాక్స్ వచ్చిందని చంద్రబాబు విమర్శించారు. ఏపీకి రావాల్సిన రూ.1.80 లక్షల కోట్లు పెట్టుబడులు పోయాయని, ఆదానీ డేటా సెంటర్, లులు, పేపర్ మిల్లు, సింగపూర్ కంపెనీలు వెళ్లిపోయాయని బాబు తెలిపారు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేశామని, జగన్ 9 నెలల పాలనలో ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదని చంద్రబాబు ఆక్షేపించారు. రాష్ట్ర యువత భవిష్యత్ ఏం కావాలి.. ఇది మీరు చేసిన ద్రోహం కాదా అంటూ బాబు ప్రశ్నించారు. మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని విమర్శించారు. తమ హయాంలో దావోస్‌లో ఏపీ పేరు మార్మోగిపోయిందని, ఇప్పుడు దావోస్ సదస్సులో ఏపీ ప్రాతినిధ్యమే లేదని మండిపడ్డారు. విశాఖలో మిలీనియం టవర్స్‌లో కంపెనీలను వెళ్లగొట్టి సచివాలయం పెడతారా అంటూ ప్రశ్నించారు.