అమరావతి రైతుల 600 రోజుల ఉద్యమం చారిత్రాత్మకమన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. జగన్ చేస్తున్న దాడి అమరావతిపై కాదు.. యావత్ రాష్ట్ర సంపద సృష్టిపై అని విమర్శించారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని.. ఉద్యమాన్ని అణిచివేయాలని చూసినా మొక్కవోని దీక్షతో రైతులు ముందుకు వెళ్లడం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.
కన్నతల్లిలాంటి 32,323 ఎకరాల భూమిని రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు, కూలీలు త్యాగం చేశారని అన్నారు చంద్రబాబు. వారిచ్చిన భూమిలోనే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యోగులకు ఇళ్ళు నిర్మించామని చెప్పారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్, నేల పటుత్వం లేదు, ముంపు ప్రాంతం, అన్ని వర్గాల ప్రజలుంటే ఒక సామాజిక వర్గమే ఉందంటూ రకరకాల అసత్య ప్రచారాలు చేశారన్న ఆయన… ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా వైసీపీ తప్పుడు ప్రచారం మాత్రం మానలేదని మండిపడ్డారు. రాజధానిలో రోడ్లకు వేసిన కంకరను దొంగతనంగా తవ్వుకుని, హైకోర్టు సమీపంలో ఇసుకను మాయం చేసే స్థితికి వచ్చారని.. ఆఖరికి అంబేద్కర్ స్మృతి వనాన్ని కూడా చెడగొట్టారని ఆరోపించారు చంద్రబాబు.