– ఏపీ సీఎంపై చంద్రబాబు సీరియస్
– పోలీసులకూ వార్నింగ్
– కేసులకు భయపడేది లేదన్న టీడీపీ బాస్
ఏపీని కాపాడే పోరాటంలో ప్రజలు, పోలీసుల సహకారం కావాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… చట్టాలను అతిక్రమించే పోలీసులూ నేరస్థులే అని చెప్పారు. తన కుప్పం పర్యటన సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తతలపై మాట్లాడారు చంద్రబాబు. జిల్లా ఎస్పీ లా అండ్ ఆర్డర్ ను కాపాడేందుకు వచ్చారా..? టీడీపీ కార్యకర్తలపై దాడులకు వచ్చారా..? అని ప్రశ్నించారు. రోడ్ షోలు రాష్ట్రానికి కొత్త కాదన్నారు. గత 70 ఏళ్ల నుంచి జరగలేదా అని అడిగారు.
టీడీపీ 40 ఏళ్లు పోరాడిన పార్టీ అని తెలిపారు చంద్రబాబు. ఎన్నో ఇబ్బందులను సమర్థంగా ఎదుర్కొన్నామని.. రాష్ట్రాన్ని అంధకారం చేయకూడదని పోరాడుతున్నామని చెప్పారు. తప్పుడు కేసులు పెట్టి అడ్డుకోవాలని చూస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎవరు కనపబడితే వాళ్లపై కేసు పెట్టి జైల్లో పెడతారా?, తాను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్, జగన్ పాదయాత్రలు చేశారు కదా అడ్డుకున్నామా అని నిలదీశారు. ఆ పాదయాత్రలకు పోలీస్ భద్రత కల్పించానని.. ఇప్పుడు తన నియోజకవర్గంలో తాను తిరుగుతుంటే అడ్డుపడుతున్నారని.. ఇదేం కర్మ జగన్ అంటూ ఫైరయ్యారు.
దాడి చేసి తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని.. పోలీస్ వ్యవస్థలో కొందరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఫైరయ్యారు చంద్రబాబు. కుప్పంలో ప్రభుత్వం రౌడీల రాజ్యం తేవాలని చూస్తోందని తాము అణచివేస్తామన్నారు. శాంతిభద్రతలు కాపాడని పోలీసులు ఖాకీ బట్టలు వేసుకున్న నేరస్తులని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వంలో మాదకద్రవ్యాలకు ఏపీ.. రాజధానిగా మారిందని ఆరోపించారు. ‘‘జగన్ ఖబడ్దార్.. గుర్తుపెట్టుకో.. ఇసుక మైనింగ్ లో నీకు రూ.50 కోట్ల కప్పం కట్టాలా? గౌరవ సభ అసెంబ్లీని కౌరవ సభగా మార్చావు. తిరిగి గౌరవ సభగా మారినప్పుడే అసెంబ్లీలో అడుగుపెడతా. రాష్ట్రంలో రెండే ప్రత్యామ్నాయాలు.. జగన్ కు భయపడి బతకడం.. లేదా.. తప్పులను ఎదిరించి నాలుగు రోజులు జైల్లో ఉండి రావడం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. జడ్జీలపైనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. సీఎం జగన్ పనైపోయిందని.. ఇంటికి పోతారని సెటైర్లు వేశారు. సీఎంకు ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని.. ఓటమి భయంతోనే తప్పుడు కేసులు పెట్టి అడ్డుకుంటున్నారని విమర్శించారు. 5 కోట్ల మంది బాధపడుతుంటే శాడిస్ట్ సీఎం ఆనందపడతారని వ్యాఖ్యానించారు చంద్రబాబు.