వైసీపీ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాబాయిని చంపినంత సులభంగా తనను కూడా చంపొచ్చని సీఎం జగన్ అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు లోకేశ్ ను టార్గెట్ చేసుకున్నారని విమర్శించారు. బాబాయిని చంపిన వాడు నేడు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని, ఇదేం ఖర్మ అని ఆయన మండిపడ్డారు.
వైసీపీ తాటాకు చప్పుళ్లకు తాము భయపడబోమన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇదే ఆఖరి అవకాశమన్నారు. ఏపీలోని ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో విజయరాయి గ్రామంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. బాబాయిని చంపి అబద్ధాలు అల్లిన జగన్‌కి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నది ప్రజల డిమాండ్ అని ఆయన తెలిపారు.
వైసీపీ గెలిస్తే మనకు రాజధాని అమరావతి ఉండబోదన్నారు. వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ కావటం జగన్ రెడ్డికి గట్టి చెంపదెబ్బ ఆని ఆయన వ్యాఖ్యానించారు. తండ్రి హత్య కేసుపై సునీత సుప్రీం కోర్టు వరకు చేసిన పోరాటాన్ని అంతా అభినందించాలన్నారు.
తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడాలని వైఎస్ సునీత పోరాడుతోందన్నారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి, ఆపై బెదిరింపులకు దిగుతున్నారన్నారు. వైసీపీ గెలిస్తే పోలవరాన్ని ముంచేస్తారని తాను ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. ముద్దులు పెడితే మోసపోవద్దని, పిడిగుద్దులు ఉంటాయని తాను గతంలోనే చెప్పినట్లు పేర్కొన్నారు.
‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ప్రజల్లో చైతన్యం కోసమే చేపట్టనన్నారు. మీలో చైతన్యం వచ్చి ధైర్యంగా ముందుకు రావాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తమ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులను 72 శాతం పూర్తి చేశానన్నారు. వైసీపీ రాగానే ప్రాజెక్టు రివర్స్ టెండర్ చేపట్టారని మండిపడ్డారు. కేంద్ర ప్రాజెక్టును నాశనం చేశారని ఆయన ఫైర్ అయ్యారు.